మరో సమరానికి ఈసీఐ కసరత్తు

by S Gopi |
మరో సమరానికి ఈసీఐ కసరత్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలతో పాటు జమ్మూకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ప్రారంభించింది. ఆగష్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నట్టు ఈసీ తెలిపింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జూన్ 25 నుంచి మొదలవుతుందని, జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలలో ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతాయని స్పష్టమవగా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు కూడా ఈ మూడు రాష్ట్రాలతో కలిపి నిర్వహించనున్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న శాసనసభల పదవీకాలం వరుసగా నవంబర్ 3, నవంబర్ 26, జనవరి 5, 2025న ముగియనుంది. వాటి పదవీకాలం పూర్తయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో నియోజకవర్గాల విభజన తర్వాత జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ పేర్కొంది.

2018లో జమ్మూకశ్మీర్ అసెంబీ రద్దయిన తర్వాత నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరన జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటర్ల నమోదును మరింత విస్తృతం చేసేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed