కస్టమర్‌ అకౌంట్ నుంచి రూ. 13.5 కోట్లు మోసం చేసిన బ్యాంకు మేనేజర్

by S Gopi |
కస్టమర్‌ అకౌంట్ నుంచి రూ. 13.5 కోట్లు మోసం చేసిన బ్యాంకు మేనేజర్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకులో ఓ కస్టమర్ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయలను బదిలీ చేసి బ్యాంకు మేనేజర్ మోసం చేశాడు. బ్యాంకులో మదుపు చేసిన రూ.13.5 కోట్ల డబ్బును మోసపూరితంగా ఖర్చు చేశాడని సదరు కస్టమర్ ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన శ్వేతవర్మ 2016లో తన భర్తతో కలిసి అమెరికా నుంచి స్వదేశానికి వచ్చి స్థిరపడ్డారు. గురుగ్రామ్‌లో నివశిస్తున్న ఆమెకు స్నేహితుల ద్వారా స్థానికంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ పరిచయం అయ్యాడు. విదేశాల్లో కంటే ఇక్కడే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని ఒప్పించి ఆమె ద్వారా 2019 సెప్టెంబర్ నుంచి 2023, డిసెంబర్ మధ్యకాలంలో సుమారు రూ. 13.5 కోట్ల వరకు డిపాజిట్ చేయించాడు. వడ్డీతో కలిపి విత్‌డ్రా సమయానికి మొత్తం రూ. 16 కోట్లు వస్తాయని బ్యాంకు మేనేజర్ ఆమెను నమ్మించాడు. గత నెల శ్వేతా వర్మ బ్యాంకుకు వెళ్లి ఖాతాలో సొమ్మును చూసుకుంటే అందులో ఒక్క రూపాయి కూడా లేదని తేలింది.

ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో శ్వేతవర్మ ఫిర్యాదు చేసింది. 'ఇన్నాళ్లు సదరు బ్యాంకు మేనేజర్ తనకు అనుమానం రాకుండా నకిలీ స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు, తన పేరు మీద నకిలీ ఈ-మెయిల్ ఐడీని సృష్టించి, తన మొబైల్ నంబర్‌ను బ్యాంక్ రికార్డ్‌లలో మార్చాడు. అందువల్లే తనకు ఎలాంటి విత్‌డ్రా నోటిఫికేషన్లు రాలేదని ' శ్వేత వర్మ వివరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంక్, మేనేజర్‌ను విధుల నుంచి తొలగించింది. 'కస్టమర్లకు అందించే సేవలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. ఈ ఘటన గురించి దర్యాప్తు చేపడతామని ' వెల్లడించింది. దర్యాప్తు అనంతరం కస్టమర్‌కు చెందిన మొత్తాన్ని అందజేస్తామని బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story