విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా నిబంధనలు

by John Kora |
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా నిబంధనలు
X

- ఆరేళ్ల క్రితం సుప్రీంలో రోహిత్ వేముల తల్లి పిటిషన్

- యూజీసీని ప్రశ్నించిన సుప్రీం

- డ్రాఫ్ట్ సిద్ధం చేశామని చెప్పిన యూజీసీ

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలల్లో వెలుగు చూస్తున్న కుల వివక్ష, కుల సంబంధిత అవమానాలను నిరోధించడానికి కొత్త నిబంధనలు రూపొందించామని, దీనికి సంబంధించి ముసాయిదా నిబంధనలు సిద్ధంగా ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. కొత్తగా రూపొందించిన నిబంధనలపై అభిప్రాయాలను తెలుసుకోవడానికి పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని యూజీసీ పేర్కొంది. విశ్వవిద్యాలయాల్లో ప్రబలంగా ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రోహిత్ వేముల, పాయల్ తడ్విల తల్లులు ఆరేళ్ల క్రితం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సదరు పిటిషన్‌ను జనవరిలో పరిశీలించిన సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ యూజీసీని ఆదేశించింది. ఈ మేరకు తాము కుల వివక్ష నిరోధానికి డ్రాఫ్టు నిబంధనలు రూపొందిచామని గురువారం యూజీసీ సుప్రీంకోర్టుకు తెలిపింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల 2016లో, టీఎన్ టోపివాలా నేషనల్ మెడికల్ కాలేజీలో గిరిజన విద్యార్థిని పాయల్ తడ్వి 2019లో కుల వివక్ష కారణంగా క్యాంపస్‌లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భావ్‌నగర్‌లోని మహారాజా కృష్ణకుమార్ సిన్హ్‌జీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ శైలేష్ ఎన్.జాలా అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగుల ప్రమోషన్లకు సంబంధించి యూజీసీ నిబంధనలను పునఃపరిశీలించినట్లు సుప్రీంకోర్టుకు తెలిసింది. ప్రస్తుతం యూజీసీ నిబంధనలు 2025 ముసాయిదా ఆమోద ప్రక్రియ జరుగుతుందని, ఆ తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెడతామని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. అధ్యాపకులు, అధికారులు చూపుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని వీసీలకు లేఖ రాసినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది.

విశ్వ విద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 2012 నిబంధన ప్రకారం కుల వివక్షకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను క్రోఢీకరించాలని జనవరి 3న సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మొత్తం 3,522 ఫిర్యాదులు వచ్చినట్లు యూజీసీ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టడానికి యూజీసీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని.. ఏ ఫిర్యాదును కూడా గమనించకుండా, పరిష్కరించకుండా వదిలి వేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు యూజీసీ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశామని యూజీసీ తెలిపింది. రోహిత్ వేముల, పాయల్ తల్లుత తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ తన వాదనలు వినిపించారు. ఉన్నత విద్యా సంస్థలలో జరిగిన ఆత్మహత్యల సంఖ్యపై కులాల వారీగా ఖచ్చితమైన డేటా పరిశీలించడానికి ఇందిరా జైసింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Next Story

Most Viewed