- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారతీయులకు ఝలక్ ఇచ్చిన ట్రంప్.. జన్మతః పౌరసత్వ రద్దుతో ఇబ్బందులు

- వేలాది మంది పిల్లలపై ప్రభావం
- ఆందోళనలో ఇండియన్స్
దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతీయులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. అమెరికా వెళ్లి, అక్కడే పిల్లలను కని, వారి ద్వారా వస్తున్న హక్కులను అనుభవించాలని భావిస్తున్న అనేక మంది ఎన్ఆర్ఐలకు ఈ జన్మతః పౌరసత్వ హక్కు రద్దు అంశం కలవరపెడుతోంది. అమెరికాలో అత్యధికంగా పెరుగుతున్న వలస జనాభాలో భారతీయ అమెరికన్లే ఎక్కువ. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశంలో 54 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు నివసిస్తున్నారు. ఇది అక్కడి అమెరికా జనాభాలో 1.47 శాతం. ఇందులో మూడింట రెండొంతుల జనాభా వలసదారులు కాగా,34 శాతం మంది అమెరికాలో పుట్టిన భారతీయులుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ పాలసీలో మార్పు జరిగితే అనేక మంది భారతీయుల పిల్లలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసా (హెచ్1బీ వంటివి) లేదా గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న జంటల పిల్లలకు ఇకపై జన్మతః పౌరసత్వం వర్తించదు. దీని వల్ల భారత వలసదారులకు చెందిన వేలాది మంది పిల్లలపై ప్రతీ ఏటా ప్రభావం పడనుంది.
వీరిపైనే ప్రభావం..
వీసా స్థితితో సంబంధం లేకుండా భారతీయ తల్లిదండ్రులకు యూఎస్‌లో జన్మించిన పిల్లలకు ఇకపై జన్మతః పౌరసత్వాన్ని పొందలేరు. గ్రీన్ కార్డ్ విషయంలో సుదీర్ఘంగా సమస్యలు ఎదుర్కుంటున్న భారతీయ వలసదారులు, వారి పిల్లలకు కూడా అక్కడ పౌరసత్వం రాకపోతే ఇకపై గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అమెరికాలో జన్మించినా.. జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి 21 ఏళ్ల నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొని వస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. దీని వల్ల పిల్లలు అమెరికాలో, తల్లిదండ్రులు భారత్‌లో ఉండాల్సి వస్తుంది.
'బర్త్ టూరిజం'ను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ తీసుకొని వచ్చారు. గతంలో చాలా మంది మహిళలు ప్రసవ సమయానికి అమెరికాకు వెళ్లేవారు. అక్కడ పుట్టే పిల్లలకు యూఎస్ సిటిజన్‌షిప్ వస్తుందనే అలా చేసేవారు. ఇకపై అలాంటి వారికి చెక్ పడనుంది. స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లి, అక్కడ పిల్లలను కంటే.. ఆ పిల్లలకు అమెరికా పౌరసత్వం రావడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. దీంతో చాలా మంది అక్కడే వివాహాలు చేసుకుంటుంటారు. ఇకపై అలాంటి జంటల పిల్లలకు సమస్యలు ఎక్కువ అవుతాయి.