పోస్టర్లపై శరద్ పవార్ పేరు, ఫొటోలు వాడొద్దు: అజిత్ వర్గానికి సుప్రీంకోర్టు వార్నింగ్

by samatah |
పోస్టర్లపై శరద్ పవార్ పేరు, ఫొటోలు వాడొద్దు: అజిత్ వర్గానికి సుప్రీంకోర్టు వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) బ్యానర్లపై శరద్ పవార్ పేరు, పొటోలు వాడొద్దని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పార్టీ రెండుగా చీలి పోయినప్పటికీ శరద్ చిత్రాలను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించింది. దీనికి గల కారణాలను శనివారంలోగా తెలియజేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం అజిత్ వర్గాన్ని ఆదేశించింది. శరద్ పవార్ వర్గం ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ తమ పోస్టర్లపై శరద్ పేరు, చిత్రాలను ఉపయోగిస్తున్నారని శరద్ వర్గం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

శరద్ పవార్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అజిత్ వర్గం శరద్ పవార్‌తో చారిత్రకంగా ముడిపడి ఉన్న గడియారం గుర్తును ఉపయోగిస్తున్నారని తెలిపారు. అంతేగాక శరద్‌పవార్‌ పేర్లు, చిత్రాలను అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నాయకులు ప్రచార సాధనాల్లో వాడుతున్నారని ఆరోపించారు. గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోస్టర్లలో గడియారం గుర్తు శరద్ పవార్ చిత్రాలను ఉపయోగించాలని ఛగన్ భుజ్‌బల్ చేసిన ప్రకటనను కూడా అతను సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీంతో వాదనలు విన్న ధర్మాసనం ‘అజిత్ వేరే రాజకీయ పార్టీ. శరద్‌తో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి అతని చిత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు. మీపై మీకు నమ్మకం ఉంటే సొంత గుర్తింపుతో వెళ్లండి’ అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed