'ఇతరులపై నిందలు వేయడంలో దీదీ మాస్టర్'

by Vinod kumar |
ఇతరులపై నిందలు వేయడంలో దీదీ మాస్టర్
X

న్యూఢిల్లీ: అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడికి, బీర్బాహా హన్స్‌దా వాహనం విధ్వంసానికి బీజేపీ కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పడాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్రంగా తప్పుపట్టారు. ఇతరులపై నిందలు వేయడం ఆమెకు అలవాటే అన్నారు. ఈ దాడి ఆమె వైఫల్యాన్ని తెలియజేస్తోందని చెప్పారు. ‘మరికరిపై నిందలు వేయడంలో మా దీదీ మాస్టర్. ఆ దాడి ఎవరు చేశారో ఇప్పటి వరకు తెలీదు. పోలీసులు ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారు’ అని చౌదరి అన్నారు. టీఎంసీకి ఓటు వేయనందుకు వారితో మాట్లాడనని ఆ పార్టీకి చెందిన ఓ నేత ఆదివాసీలను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.

‘కాన్వాయ్‌పై జరిగిన దాడిలో మీ పార్టీ వాళ్ల ప్రమేయం లేదని ఎలా చెప్పగలరు? ఓటు వేయలేదు కాబట్టి మీతో మాట్లాడనని మీ పార్టీ జాతీయ నాయకుడు ఆదివాసీలను బెదిరించారు. ఇదేనా మీ పాలసీ. మీకు ఓటు వేసే వాళ్లను మాత్రమే పలకరిస్తారా?’ అని చౌదరి చెప్పారు. ‘ఈ దాడిలో నా కుర్మీ సోదరుల ప్రమేయం ఉందని నేను నమ్మడం లేదు. గిరిజన సంఘం పేరుతో కుర్మీ నాయకులుగా నటిస్తూ అభిషేక్, హన్స్‌దా కాన్వాయ్‌పై బీజేపీనే దాడికి పాల్పడింది’ అని ఇటీవల మమత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మమతను చౌదరి విమర్శించారు. అయితే ఈ దాడి ఘటనలో కుర్మీ సంఘం అధ్యక్షుడు రాజేష్ మహతాతో సహా ఐదుగురిని జార్‌గ్రామ్ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. అజిత్ మహతో, అనిత్ మహతో, మన్మోహిత్ మహతో, అనూప్ మహతోలను ఇతర నిందితులుగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed