- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భూ భారతితో రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం : కలెక్టర్ మను చౌదరి

దిశ, మిరుదొడ్డి : భూ భారతితో రైతుల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ - 2025 చట్టంతో ఎంతోమంది రైతులకు మేలు చేకూరనుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూ చౌదరి పేర్కొన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎన్నోఏళ్లుగా భూ సమస్యల పరిష్కారానికై, అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు, సమయాన్ని వృధా చేసుకోవడమే తప్ప సమస్యల పరిష్కారం కాక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం భూ భారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం పై దృశ్య రూపకంగా వివరించారు.
భూ సమస్యలు కలిగిన రైతులు చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యను బట్టి తహశీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి రెండు అంచెలలో వ్యవస్థతో నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కొత్తగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారాని కై భూభారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం డిజిటల్ రూపంలో పొందుతారన్నారు. ప్రతి గ్రామానికి విలేజ్ లెవెల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు, మనిషికి ఆధార్ లాగే ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇవ్వడంతో పాటు రైతుకు సంబంధించిన వ్యవసాయ భూమికి నక్ష రూపంలో పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సదానందం, మిరుదొడ్డి మండల తహశీల్దార్ ఉదయశ్రీ, డిప్యూటీ తహశీల్దార్ సందీప్, ఎంపీడీవో గణేష్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ గణేష్, వ్యవసాయ అధికారి మల్లేశం, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.