ఢిల్లీకి నీటి విడుదలపై హిమాచల్ యూటర్న్

by S Gopi |
ఢిల్లీకి నీటి విడుదలపై హిమాచల్ యూటర్న్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై భారత అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గురువారం తన మునుపటి ప్రకటనను ఉపసంహరించుకుంది. ఢిల్లీకి నీటిని విడుదల చేస్తామని చెప్పిన ఆ రాష్ట్రం, తాజాగా తమవద్ద మిగులు జలాలు లేవని కోర్టుకు తెలియజేసింది. గత కొద్దికాలంగా ఢిల్లీ ప్రజలు హీట్‌వేవ్, నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పరిష్కరించేందుకు 137 క్యూసెక్కుల అదనపు జలాలను హిమాచల్ ప్రదేశ్ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరాకు సహకరించాలని హర్యానా ప్రభుత్వానికి కూడా సూచించింది. దీనిపై మీడియాతో మాట్లాడిన హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సఖు.. ఇప్పటికే నీటిని విడుదల చేశామని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పాలని న్యాయవాదులకు సూచించినట్టు' పేర్కొన్నారు. అనంతరం నీటి సరఫరా కోసం ఎగువ యమునా రివర్ బోర్డు (యూవైఆర్‌బీ)ని సంప్రదించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రసన్న బి వరాలేలతో కూడిన వెకేషన్ బెంచ్ మానవతా దృక్పథంతో ఢిల్లీకి నీటిని సరఫరా చేయాలని కోరుతూ యూవైఆర్‌బీకి దరఖాస్తు సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రాల మధ్య యమునా జలాలను పంచుకోవడం సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని, మధ్యంతర ప్రాతిపదికన కూడా దీనిపై నిర్ణయం తీసుకునే సాంకేతిక నైపుణ్యం ఈ న్యాయస్థానానికి లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 1994 నాటి అవగాహన ఒప్పందంలో భాగంగా పార్టీల ఒప్పందంతో ఏర్పాటైన యూవైఆర్‌బీ పరిధికే ఈ సమస్యను వదిలేయాలని బెంచ్ పేర్కొంది.

ఈ వ్యవహారంలో విచారణ సందర్భంగా తమ వద్ద మిగులు జలాలు లేవని, ఇదివరకు దీని గురించి వివరంగా చెప్పలేకపోయామని, గతంలో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు హిమాచల్ ప్రదేశ్ తరపు న్యాయవాధి చెప్పారు. దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కోర్టు మందలిచ్చింది. ఈ క్రమంలో న్యాయవాది కోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు, నీటి సంక్షోభం కారణంగా నీళ్ల ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని చెప్పిన ప్రభుత్వ సూచనను ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) పరిగణలోకి తీసుకోలేదని ఆప్ మంత్రి అతిషి ఆరోపణలు చేశారు. ట్యాంకర్ల సంఖ్య ఎందుకు తగ్గించారో డీజేపీ అధికారులు చెప్పాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలను ఖాతరు చేయకపోవడం సరికాదని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed