Delhi: చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు.. అనంతరం అరెస్ట్

by Ramesh Goud |
Delhi: చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు.. అనంతరం అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో చైన్ స్నాచర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఢిల్లీలోని పంజాబ్ బాగ్ ప్రాంతంలో జరిగింది. గత కొద్ది రోజులుగా నార్త్ ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం, సాయంత్రం వేళల్లో దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కత్తి చూపించి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిలక్ నగర్ లో కూడా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ పై దాడికి పాల్పడి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని దొంగిలించారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

దాని ఆధారంగా ఇవాళ ఉదయం అలాంటి బైక్ పైనే ఇద్దరు వ్యక్తులు వెళ్లడం చూసి పోలీసులు అనుమానించి వెంబడించారు. అంతేగాక చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లను కూడా అప్రమత్తం చేశారు. ఖియాలాలోని నాలా రోడ్డులో ఓ పోలీస్ అధికారి బైక్ పై నిందితులను వెంబడించి, బైక్ తో ఢీ కొట్టాడు. అనంతరం ఆ నిందితులు అధికారిపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఆ పోలీస్ అధికారి నిందితుల కాళ్లపై కాల్పులు జరిపాడు. అనంతరం వారిని అరెస్ట్ చేసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో నిందితుల పేర్లు వికాస్, రమేష్ అని, వీరు ఇదివరకే పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed