సిసోడియా బెయిల్‌పై పిటిషన్‌ దాఖలు‌కు ఈడీ, సీబీఐకి 4 రోజుల గడువు ఇచ్చిన కోర్టు

by Disha Web Desk 17 |
సిసోడియా బెయిల్‌పై పిటిషన్‌ దాఖలు‌కు ఈడీ, సీబీఐకి 4 రోజుల గడువు ఇచ్చిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, దీనిపై సమాధానం దాఖలు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ సమాధానం దాఖలు చేయడానికి కోర్టును వారం రోజుల గడువు కోరాయి. అయితే సిసోడియా తరపు న్యాయవాది వివేక్ జైన్ ఈ అభ్యర్థనను వ్యతిరేకించారు.

మాజీ డిప్యూటీ సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఈడీ ఇంతకుముందు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు గడువు కావాలని కోరుతున్నారని వివేక్ జైన్ ఎత్తి చూపడంతో జస్టిస్ స్వర్ణ కాంత ఈడీ, సీబీఐకి సమాధానం ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం ఇచ్చారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 15 వరకు పొడిగించింది.

అయితే అంతకుముందు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు పిటిషన్‌లను కొట్టివేసింది. దీంతో ట్రయల్ కోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మే 2న సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో సిసోడియాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, మద్యం వ్యాపారులతో సహా పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి.

Next Story