Arvind Kejriwal : బీజేపీ పరువునష్టం కేసు.. కేజ్రీవాల్, అతిషికి షాక్

by Hajipasha |
Arvind Kejriwal : బీజేపీ పరువునష్టం కేసు.. కేజ్రీవాల్, అతిషికి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో ముగ్గురు ఆప్ సీనియర్ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ‘‘బీజేపీ సూచనల మేరకు ఢిల్లీలోని బనియా, పూర్వాంచలి, ముస్లిం వర్గాలకు చెందిన దాదాపు 30 లక్షల మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది’’ అంటూ 2018 సంవత్సరంలో ఆప్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. వాటి వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిందంటూ ఆ పార్టీ నేత రాజీవ్ బబ్బర్ దిగువ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దానికి సంబంధించిన విచారణ వరుస అప్పీళ్లతో చివరకు సోమవారం రోజు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.

తమపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. ఢిల్లీ ఓటర్ల మేలు కోసమే తాము ఆనాడు అలాంటి వ్యాఖ్యలు చేశామన్న ఆప్ నేతల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. పొలిటికల్ మైలేజీ కోసమే ఆ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా తెలుస్తోందని హైకోర్టు బెంచ్ పేర్కొంది. వాటిపై విచారణ కోసం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆప్ నేతలకు ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్ధించింది.

Advertisement

Next Story