Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. మరికొద్ది రోజులు కస్టడీలోనే

by Harish |
Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. మరికొద్ది రోజులు కస్టడీలోనే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయన్ను సీబీఐ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచింది. విచారణ తర్వాత న్యాయమూర్తి, కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోవైపు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అరెస్ట్‌ సరైన కారణం లేకుండా జరిగిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాయిదా వేయాలని కోరింది. ఈ సందర్బంగా బెయిల్‌ను రద్దు చేస్తే మళ్లీ అరెస్టు చేస్తారా అని ఢిల్లీ హైకోర్టు ఈడీని ప్రశ్నించింది. తదుపరి ఈ కేసు విచారణను సెప్టెంబర్ 5, 2024కి వాయిదా వేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ మార్చి 21 న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ కూడా ఆయన్ను అరెస్ట్ చేయగా, ఈ కేసులో బెయిల్ ఇంకా లభించలేదు. దీంతో ఆయన ఇంకా తీహార్‌ జైల్లోనే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed