IVF Clinic : వయసు మించిపోయిందని ‘ఐవీఎఫ్‌’కు హాస్పిటల్ నిరాకరణ.. హైకోర్టు కీలక తీర్పు

by Hajipasha |
IVF Clinic : వయసు మించిపోయిందని ‘ఐవీఎఫ్‌’కు హాస్పిటల్ నిరాకరణ.. హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : భర్త వయసు 58 ఏళ్లు, భార్య వయసు 48 ఏళ్లు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా(Kolkata)లో ఉన్న కాశీపూర్ ఏరియాకు చెందిన ఈ దంపతులకు 30 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయినా ఇప్పటిదాకా సంతానం కలగలేదు. దీంతో వారు ఐవీఎఫ్ చికిత్స ద్వారా సంతానం పొందాలని భావించారు. ఇద్దరూ కలిసి కోల్‌కతాలోని ఒక ఐవీఎఫ్ క్లినిక్‌(IVF Clinic)కు వెళ్లారు. తమకు ఐవీఎఫ్ చికిత్స చేయమని కోరారు. అయితే పురుషుడి వయసు 55 ఏళ్లలోపు ఉంటేనే తాము చికిత్స చేస్తామని ఐవీఎఫ్ క్లినిక్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ రూల్స్‌ను తాము అతిక్రమించలేమని స్పష్టం చేశారు. దీనిపై ఆ దంపతులు పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖను సంప్రదించారు. అక్కడ కూడా ఐవీఎఫ్ చికిత్సకు అనుమతులు లభించలేదు.

ఇక మరో దారి లేక వారు నేరుగా కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము ఐవీఎఫ్ చికిత్స చేయించుకునేందుకు అనుమతించాలని కోరారు. ఎలాగైనా సంతానం పొందాలనే ఆ దంపతుల ఆవేదనను అర్థం చేసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమృతా సిన్హా కీలక తీర్పును వెలువరించారు. సదరు దంపతులకు వయో పరిమితి నుంచి మినహాయింపు కల్పించి ఐవీఎఫ్ చికిత్స చేయాలని బెంగాల్ ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు. వయో పరిమితి కారణంగా ఐవీఎఫ్ చేయించుకోలేకపోతున్న ఎంతోమందికి ఈ తీర్పు ఆశాకిరణంలా దారి చూపుతుందని న్యాయమూర్తి అమృతా సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed