Coaching centers: కోచింగ్ సెంటర్ ఘటన కళ్లు తెరిపించింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Coaching centers: కోచింగ్ సెంటర్ ఘటన కళ్లు తెరిపించింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లు డెత్ చాంబర్లుగా మారాయని ఫైర్ అయింది. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే విద్యార్థుల జీవితాలతో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు చెలగాట మాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా నిబంధనలు పూర్తిగా పాటించకపోతే ఆన్ లైన్‌లో తరగతులు నిర్వహించుకోవాలని సూచించింది.

ఈ సంఘటన అందరి కళ్లు తెరిపించేలా ఉందని, నియమ నిబంధనలు పాటించకపోతే ఏ ఇన్‌స్టిట్యూట్‌ను కూడ నడపడానికి అనుమతించరాదని స్పష్టం చేసింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో అన్ని భద్రతా చర్యలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కి నోటీసులు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లు నిర్వహించడానికి ఎటువంటి రూల్స్ ఉన్నాయో తెలియజేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. తమ కెరీర్ కోసం కోచింగ్ సెంటర్‌లలో చేరిన కొంతమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపింది.

కాగా, జూలై 27న దేశ రాజధానిలో అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని ఐఏఎస్ స్టడీ సెంటర్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed