అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకం

by John Kora |
అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకం
X

- ట్రంప్ చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటున్న జిన్‌పింగ్

- ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి

- ప్రకటించిన చైనా ఫైనాన్స్ మినిస్ట్రీ

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఇకపై తాము కూడా సుంకాలు విధించనున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే అన్నా రకాల వస్తువులపై 35 శాతంః మేర సుంకాలు విధించనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతే కాకుండా చైనా నుంచి ఎగుమతి అవుతున్న సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, యట్రియం వంటి అరుదైన భారీ, మధ్యస్థ ఖనిజాల ఎగుమతులపై కూడా నియంత్రణ విధిస్తున్నామని.. ఇవి ఏప్రిల్ 4 నుంచి అమలులోకి వచ్చినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. కొత్త సుంకాలు, ఎగుమతులపై పరిమితులు విధించడంతో పాటు 11 విదేశీ సంస్థలను 'నమ్మదగని సంస్థల' జాబితాలోకి చేర్చింది. దీంతో ఆ సంస్థలపై శిక్షార్హమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

'చట్ట ప్రకారం సంబంధిత వస్తువులపై చైనా ప్రభుత్వం ఎగుమతి నియంత్రణలను అమలు చేయడానికి ప్రధాన కారణం జాతీయ భద్రత. అంతే కాకుండా జాతి ప్రయోజనాలు కూడా కాపాడాలని భావిస్తుండటమే' అని చైనీస్ కామర్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రకటన కంటే ముందే బయలుదేరి.. మే 15 నాటికి చేరుకునే షిప్‌మెంట్లకు అదనపు సుంకాలు అమలు చేయబడవని తెలిపింది. ఏప్రిల్ 10 మధ్యాహ్నం 12.01 గంటలకు ముందు రవాణా చేయబడి.. ఏప్రిల్ 13 మధ్య రాత్రి 12.00 గంటలకు దిగుమతి చేసుకుంటే.. అదనపు సుంకాలు వర్తింపచేయబడవని స్టేట్ కౌన్సిల్ ఫర్ టారిఫ్ కమిషన్ తెలిపింది.

కాగా, తమ టారిఫ్‌లను ఉపసంహరించుకోవాలని అమెరికాను చైనా కోరిన ఒక రోజు తర్వాత తాజా సుంకాలు విధించబడటం గమనార్హం. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవటానికే ప్రతీకార సుంకాలను విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా సుంకాలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మా స్వంత హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తప్పకుండా ప్రతిఘటిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్తల మధ్య ఉద్రిక్తల కారణంగా లోతైన వాణిజ్య యుద్దం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విధించిన 20 శాతం టారిఫ్‌లకు అదనంగా చైనా 34 శాతం టారిఫ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. దీంతో చైనా దిగుమతులపై మొత్తం 54 శాతం సుంకాలు కట్టాల్సి ఉంది.

Next Story

Most Viewed