అరుణాచల్ మాదే.. చైనా వివాదాస్పద ప్రకటన

by Hajipasha |
అరుణాచల్ మాదే.. చైనా వివాదాస్పద ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : గత వారం అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించి.. దాదాపు రూ.41వేల కోట్లు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో చైనా బార్డర్‌ను ఆనుకొని ఉండే కీలకమైన సేలా టన్నెల్‌ను జాతికి అంకితమిచ్చారు. అంతర్జాతీయ మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చాయి. వాటిపై చైనా భగ్గుమంది. భారత్‌పై మరోసారి డ్రాగన్ విషం కక్కింది. భారతదేశాన్ని కవ్వించేలా కీలక ప్రకటనలు విడుదల చేసింది. ఏకంగా అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వ్యాఖ్యలు చేశారు. ‘‘జాంగ్నాన్ ప్రాంతం (అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగమే’’ అని వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. ‘‘అరుణాచల్‌లో భారత్ సాగించే కదలికలు ఇరుదేశాల సరిహద్దుల్లో సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తాయి. చైనా-భారత్ సరిహద్దులోని తూర్పు భాగంలో భారత ప్రధాని పర్యటనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈవిషయాన్ని మేం భారతదేశానికి బలమైన స్వరంతో తెలియజేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఎన్నడూ భారతదేశ భూభాగంగా గుర్తించలేదు. ఆ ప్రాంతాన్ని ఏకపక్షంగా అభివృద్ధి చేసే హక్కు భారతదేశానికి లేదని డ్రాగన్ వాదిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌ లేదా జాంగ్నాన్ అని పిలుస్తుంటుంది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed