ఇది నాపై దాడి కాదు.. న్యాయవ్యవస్థ పై దాడి: న్యాయవాది షేక్‌ లతీఫ్‌

by Mahesh |
ఇది నాపై దాడి కాదు.. న్యాయవ్యవస్థ పై దాడి: న్యాయవాది షేక్‌ లతీఫ్‌
X

దిశ, ఖమ్మం: నేలకొండపల్లి వృద్ద దంపతుల హత్య కేసులో నిందితులకు బెయిల్‌ కోసం పెట్టిన ష్యూరిటీలు నకిలీవంటూ కార్యదర్శి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపితులను ఆరెస్టు చేశారు. కాగా న్యాయవాది షేక్‌ లతీఫ్‌ ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉందని సీనియర్‌ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన పై సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాధితుడు, న్యాయవాది లతీఫ్‌తో బాటు పలువురు సీనియర్‌ న్యాయవాదులు మాట్లాడారు. నేలకొండలపల్లిలో జరిగిన వృద్ద దంపతుల హత్య కేసులో నిందితులకు గౌరవ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, రిలీజ్‌ ఆర్డర్‌ కోసం పెట్టుకొన్న ష్యూరిటీలు ఫోర్జరీ చేసినవంటూ వచ్చిన ఫిర్యాదులో మొత్తం ఏడుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో న్యాయవాది లతీఫ్‌ను ఆరవ నిందితుడిగా చేర్చారు. కాగా పోలీసులు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నేరుగా 8 మంది పోలీసు సిబ్బందితో ఇంటి పై దాడి చేశారన్నారు. బెయిలబుల్‌ సెక్షన్‌లు ఉన్నప్పటికీ, ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండా, అక్రమంగా ఇంట్లో జొరబడి, ఇంట్లో వాళ్లను భయ బ్రాంతులకు గురి చేశారని తెలిపారు.

తన కూతురు న్యాయవాది అని తెలిసి కూడా, ఆమె పై ఓ కానిస్టేబుల్‌ దౌర్జన్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో పెనుగులాడి మొబైల్‌ ఫోన్‌ బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించాడన్నారు. తనకు ఒక ఫోన్‌ కాల్‌ చేసి స్టేషన్‌కు రమ్మంటే వెళ్లి సమాధానం చెప్పే వాడినని, ఉద్ధేశ్యపూర్వకంగానే తన పై పోలీసులు అనైతిక దాడికి పాల్పడ్డారని న్యాయవాది లతీఫ్‌ ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత కూడా తనతో అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక న్యాయవాదిని అని కూడా చూడకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించడమే కాకుండా, పరామర్శించడానికి వచ్చిన సీనియర్‌ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్నారు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వదగిన సెక్షన్‌లు అయినప్పటికీ, ఉద్ధేశ్యపూర్వకంగా, కక్ష్య సాధింపు ధోరణిలో రిమాండ్‌కు తరలించాలని పన్నాగం పన్నారన్నారు. పోలీసులు వ్యవహార శైలి పై న్యాయమూర్తి సున్నితంగా మందలించి, వ్యక్తిగత పూచీకత్తు పై విడుదల చేశారని తెలిపారు. ఇది నా ఒక్కడి పై దాడి కాదని ఇది పూర్తి న్యాయవ్యవస్థ పై దాడి గా న్యాయవాది లతీఫ్‌ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీనియన్‌ న్యాయవాది అమర్‌ చంద్‌తో బాటు పలువురు సీనియర్‌ , జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed