Cheetah Deaths : ‘కునో’లో చీతాల మరణాలు.. రిలయన్స్ సాయం తీసుకున్న కేంద్రం!

by Hajipasha |
Cheetah Deaths : ‘కునో’లో చీతాల మరణాలు.. రిలయన్స్ సాయం తీసుకున్న కేంద్రం!
X

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో గతేడాది మార్చి 27 నుంచి మే 9 మధ్యకాలంలో మూడు చిరుత పులులు మృత్యువాతపడ్డాయి. దీంతో చీతాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గ్రీన్స్ జువాలాజికల్ రెస్క్యూ అండ్ రిహ్యాబిలిటేషన్ సెంటర్ (జీజెడ్‌ఆర్ఆర్సీ) నుంచి జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) అప్పట్లో గైడెన్స్ తీసుకుంది. అయితే ఈవిషయం ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జీజెడ్‌ఆర్ఆర్సీ సంస్థ గుజరాత్‌లోని జామ్ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఎన్‌టీసీఏ ఆహ్వానం మేరకు జీజెడ్‌ఆర్ఆర్సీ నిపుణులు కునో నేషనల్ పార్కుకు వెళ్లి చీతాల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఎన్‌టీసీఏ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ అభిషేక్ కుమార్‌కు జీజెడ్‌ఆర్ఆర్సీకి మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయి.

దీనిపై మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త అజయ్ దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కునో నేషనల్ పార్కులో చీతాల మరణాలను ఆపే విషయంలో ఓ ప్రైవేటు సంస్థ నుంచి సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ‘‘విదేశాల నుంచి చీతాలను తీసుకురావడం దగ్గరి నుంచి కునో నేషనల్ పార్కులో వాటిని నిర్వహించే వరకు ప్రతీదశలో ఎంతోమంది వన్యప్రాణి నిపుణులు అందుబాటులో ఉన్నారు. అయినా ఇతర ప్రైవేటు సంస్థలను ఎందుకు సంప్రదించారు ?’’ అని అజయ్ దూబే ప్రశ్నించారు. ఒకవేళ సంప్రదించినా ఆవిషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. చీతా ప్రాజెక్టుకు సంబంధించిన మానిటరింగ్ కమిటీ సమావేశాలపై రూపొందించిన నివేదికలో ఎక్కడా సదరు ప్రైవేటు సంస్థ నుంచి సలహాలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించలేదని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed