దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కేంద్రం తనిఖీలు: విమానయాన మంత్రి

by S Gopi |
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కేంద్రం తనిఖీలు: విమానయాన మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐ) విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలిన ఘటనను కేంద్రం సీరియస్‌కు తీసుకుంది. ఇప్పటికే కేంద్ర పౌర విమానాయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఘటనా స్థలానికి వెళ్లి ఆయన పరిశీలించారు. అనంతరం ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు దేశంలోని అన్ని విమానాశ్రయలను కేంద్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తుందని చెప్పారు. 'మా పరిధిలో వచ్చే అన్ని విమానాశ్రయాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా అవసరమైన నివేదికను తయారు చేస్తాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థ అవసరమైతే ఏర్పాటు చేస్తామని ' పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-1 వద్ద పాత భవనం పైభాగంలోని పైకప్పు కూలిపోవడంతో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఇప్పటికే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వారి వైపు నుంచి ధృవీకరణ, తనిఖీ చేయాలని కోరాం. ఇదే సమయంలో మేము కూడా మంత్రిత్వ శాఖ తరపున డీజీసీఏ పరిశీలిస్తుంది. విమానాశ్రయాల భద్రత, తనిఖీలను పర్యవేక్షించే డీజీసీఏ కూడా నివేదికను సిద్ధం చేస్తుందని మంత్రి వివరించారు. ఈ ఒక్క విమానాశ్రయమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని నిర్మాణాలను పరిశీలిస్తామని, వాటిలో ఇలాంటి సమస్యలు ఉంటే తీవ్రంగా పరిగణిస్తామని హామీ ఇస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story