TV Somanathan : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా టి.వి.సోమనాథన్‌.. ఎవరాయన ?

by Hajipasha |
TV Somanathan : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా టి.వి.సోమనాథన్‌.. ఎవరాయన ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టి.వి.సోమనాథన్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబ స్థానంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా టి.వి.సోమనాథన్‌ బాధ్యతలను చేపట్టనున్నారు. రాజీవ్ గౌబ గత ఐదేళ్లుగా ఆ పదవిలో సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి 2019 సంవత్సరంలో రెండేళ్ల కాలపరిమితి కోసమే రాజీవ్ గౌబను కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయనకు 2021, 2022, 2023 సంవత్సరాల్లో వరుసగా పదవీ కాలంలో పొడిగింపు ఇచ్చారు. జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2019కు రూపకర్తగా రాజీవ్ గౌబను చెబుతుంటారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆ చట్టంలో సంచలన నిబంధనలను పొందుపరిచారు.

టి.వి.సోమనాథన్ ఎవరు ?

టి.వి.సోమనాథన్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో తమిళనాడు ప్రభుత్వంలో వివిధ కీలక హోదాల్లో సేవలు అందించారు. టి.వి.సోమనాథన్ కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆయన 2019 నుంచి 2021 వరకు కేంద్ర ఆర్థికశాఖ ఫైనాన్స్ ఎక్స్‌పెండిచర్ విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ హోదాలోనే సోమనాథన్ సేవలు అందించారు. 2015 నుంచి 2017 మధ్యకాలంలో ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రెటరీగానూ పనిచేశారు. అంతకుముందు కొంతకాలంపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రెటరీగా కూడా సేవలు అందించారు. వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు కార్పొరేట్ వ్యవహారాల విభాగం డైరెక్టర్‌గా కూడా సోమనాథన్ సేవలు అందించారు. తమిళనాడు క్యాడర్‌కు చెందిన సోమనాథన్ 2007 నుంచి 2010 వరకు చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా వ్యవహరించారు. అప్పట్లో తమిళనాడు సీఎం కార్యాలయం జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

Next Story