మరో ఇస్లామిక్ సంస్థపై కేంద్రం నిషేధం.. ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ

by karthikeya |
మరో ఇస్లామిక్ సంస్థపై కేంద్రం నిషేధం.. ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో అతివాద ఇస్లామిక్ గ్రూప్‌పై నిషేధం విధించింది. హిజ్బ్‌–ఉత్‌–తహ్రీర్‌ అనే సంస్థ దేశంలో రహస్యంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోందని, అందుకే నిషేధిస్తున్నామని శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. హిజ్బ్‌–ఉత్‌–తహ్రీర్‌ 7 దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తోందని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలతో ఇస్లామిక్‌ రాజ్యస్థాపనే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోందని, అందుకే ఇకపై దేశంలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగకుండా నిషేధం విధిస్తున్నామని సదరు నోటిఫికేషన్‌లో కేంద్ర హోం శాఖ పేర్కొంది.

హిజ్బ్‌–ఉత్‌–తహ్రీర్‌పై కేంద్ర హోం శాఖ ప్రధాన ఆరోపణలు:

  • 1953లో జెరుసలేంలో ప్రారంభమైన హిజ్బ్‌–ఉత్‌–తహ్రీర్‌ ఇస్లామిక సంస్థ దేశంలో దారితప్పిన యువతను తమ గుప్పిట్లో పెట్టుకుని వారిలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందిస్తోంది.
  • పలు సోషల్ మీడియా వేదికలు, రహస్య యాప్‌లు, స్పెషల్ మీటింగ్స్ ద్వారా యువతను ఈ గ్రూపులో చేర్చుకుని వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తోంది.
  • ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే టార్గెట్‌గా పనిచేస్తోంది.
  • 4. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్‌–ఉత్‌– తహ్రీర్‌ భద్రతకు ముప్పుగా మారుతోంది.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు కూడా అనేక ఇస్లామిక్ గ్రూప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దక్షిణ భారత దేశం కేంద్రంగా ఇస్లామిక్ కార్యకలాపాలు నడుపుతున్న పాపురల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), జమ్మూ కశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జమాత్-ఏ-ఇస్లామి వంటి సంస్థలపై ఇప్పటికే కేంద్రం బ్యాన్ విధించింది.

Advertisement

Next Story