‘నీట్‌’ వ్యవహారంపై సీబీఐ కేసు

by S Gopi |
‘నీట్‌’ వ్యవహారంపై సీబీఐ కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తాజాగా కేసు నమోదు చేసింది. నీట్ పరీక్షలకు సంబంధించిన పెరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ సమగ్రంగా విచారణ చేపట్టనుంది. కేంద్ర విద్యాశాఖ సూచనల ఆధారంగా ఈ కేసు వ్యవహారంలో గుర్తు తెలియని వారిని చేర్చామని, వివిధ రాష్ట్రాల్లో నమోదు చేసిన కేసులను చేపడతామని సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వ్యవహారంపై అరెస్ట్ చేసిన నిందితులను కూడా కస్టడీలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా బీహార్‌లో పేపర్ లీక్, ఇంకా పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారనే కారణాలతో గ్రేస్ మార్కులు కలపడం లాంటి అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో చివారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ పరీక్షల చుట్టూ ఉన్న 'పెద్ద కుట్ర' గురించి దర్యాప్తు చేసేందుకు సీబీఐ బృందాలు బీహార్, గుజరాత్‌లకు వెళ్లనున్నాయి. ఇప్పటికే ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు అంగీకరించిన నలుగురు వ్యక్తులను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. పేపర్ లీక్ కేసులో జరిగిన అక్రమాలలో బీహార్, గుజరాత్ రాష్ట్రాల పోలీసుల నుంచి కేసులను స్వాధీనం చేసుకునేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటోంది. పేపర్ లీకేజీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు బీహార్, గుజరాత్ పోలీసులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు.

ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అరెస్ట్..

బీహార్‌లో నీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత, సీబీఐ మరో బృందం తమ దర్యాప్తును మహారాష్ట్రలోనూ ప్రారంభించారు. ఈ క్రమంలోనే లాతూర్‌లో ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు ఉపాధ్యాయులను లాతూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్‌ఖాన్ పఠాన్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ జిల్లాలో ప్రైవేట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉందన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత వారిని పోలీసులు విడుదల చేశారు. అవసరమైతే వారు మళ్లీ విచారణకు రావాలని స్పష్టం చేశారు.

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొదటగా నీట్‌ పరీక్షను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రక్షాళన కోసం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ తర్వాత ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ఐటీపీఓ) చైర్మన్‌, ఎండీగా ఉన్న ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి నిర్ణయించారు.

మరోవైపు.. పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షా ప్రక్రియలో సంస్కరణలు, డేటా భద్రతా ప్రోటోకాల్‌లలో మెరుగుదలలు, ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరును కమిటీ సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed