రాష్ట్రాల నుంచి కేసులు స్వాధీనం చేసుకున్న సీబీఐ బృందం

by S Gopi |
రాష్ట్రాల నుంచి కేసులు స్వాధీనం చేసుకున్న సీబీఐ బృందం
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి పెరుగుతున్న ఒత్తిళ్ల మధ్య సీబీఐ అధికారులు బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఐదు కేసులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సీబీఐ ఐపీసీ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. గుజరాత్, బీహార్‌ల నుంచి ఒక్కో కేసు, రాజస్థాన్ నుంచి మూడు కేసులను తమ స్వంత ఎఫ్ఐఆర్‌గా నమోదు చేసినట్టు చెప్పారు. అదే సమయంలో మహారాష్ట్రంలోని లాతూర్ నుంచి మరో కేసును కూడా తీసుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. బీహార్‌కు చెందిన కేసు మినహా మిగిలిన చోట్ల స్థానిక అధికారులు, ఇన్విజిలేటర్లు, అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టుగా కనిపిస్తోంది. కొత్త కేసుల స్వాధీనం తర్వాత నీట్-యూజీలో అక్రమాలకు సంబంధించి మొత్తం ఆరు కేసులను విచారిస్తున్నామని సీబీఐ అధికారులు వెల్లడించారు.

లీకేజీని బీహార్ సీఎం, ఎన్‌డీఏలకు ముడిపెట్టిన ఆర్జేడీ

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుంటే మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయంగా కూడా వివాదం ముదురుతోంది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన సంజీవ్ ముఖియా భార్య, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్డీఏ నేతలతో ఉన్న ఫోటోలను ఆర్జేడీ సోషల్ మీడియాలో ఉంచింది. ఇదివరకు ఇదే కేసులో ఆర్జేడీ తేజస్వి యాదవ్ పీఏ ప్రీతమ్ కుమార్‌కు పేపర్ లీకేజీ లింక్ ఉందని ఆరోపించారు. దాంతో తాజా ఫోటోలను బహిర్గతం చేస్తూ జేడీయూ, ఎన్డీఏలపై విమర్శలు పెంచారు. నీట్ కేసును సీబీఐకి బదిలీ కావడంతో సోమవారం ఆర్జేడీ తన అధికారిక ఎక్స్‌లో సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి సీఎం నితీష్ కుమార్, కేబినెట్ మంత్రి శ్రవణ్ కుమార్, జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్, ఇతరులతో ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన పేపర్ లీకేజీలన్నింటికీ సూత్రధారులైన వారు జేడీయూ, ఎన్డీఏ నేతలకు మాత్రమే ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఇది యాదృచ్ఛికమా, ఉద్దేశపూర్వకమా? అని ఆర్జేడీ ప్రశ్నించింది.

Advertisement

Next Story

Most Viewed