హైకోర్టు జడ్జి రాజీనామా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ?

by Hajipasha |
హైకోర్టు జడ్జి రాజీనామా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానంలకు పంపారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఆయన రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మీడియాతో మాట్లాడేందుకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ నిరాకరించారు. ‘‘రాజీనామా గురించి ఈరోజు నేను ఇంకేమీ చెప్పదల్చుకోలేదు. తర్వాత మాట్లాడతాను’’ అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వివిధ విద్యా సంబంధిత సమస్యలపై గంగోపాధ్యాయ సంచలన తీర్పులు ఇచ్చారు. కోట్లాది రూపాయల విలువైన ఉపాధ్యాయ నియామక కుంభకోణాన్ని విచారించిన న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఆదేశించారు. 2018లో కలకత్తా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా చేరిన ఆయన 2020లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతిని పొందారు.

Advertisement

Next Story

Most Viewed