మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అమిత్ అరోరాకు మధ్యంతర బెయిల్

by Harish |
మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అమిత్ అరోరాకు మధ్యంతర బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అమిత్ అరోరాకు మధ్యంతర బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్యకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ రెండు నెలల మధ్యంతర బెయిల్ కోసం అమిత్ అరోరా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా. దీనిని విచారించిన ఈడీ, సీబీఐ వ్యవహారాల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా,రూ. రెండు లక్షల వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ మంజూరు చేశారు. అలాగే ఆయన భార్య చికిత్సకు సంబంధించి అవసరమైతే తప్ప, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ని విడిచిపెట్టవద్దని నిందితుడికి సూచించారు.

అంతకుముందు విచారణలో భాగంగా అమిత్ అరోరా తరపున సీనియర్ న్యాయవాది వికాస్ పహ్వా తన వాదనలు వినిపిస్తూ, నిందితుడి భార్య తండ్రి ఇప్పటికే చనిపోయాడు, ఆమె తల్లికి 72 ఏళ్లు, సోదరులు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వారి ఇంటికి దగ్గర్లో ఉండరు. అనారోగ్యంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను చూసుకోడానికి భర్త ప్రక్కనే ఉంటేనే ఆమెకు ధైర్యంగా ఉంటుంది. గతంలో కూడా అరోరాకు ఇదే కారణంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, అతను దుర్వినియోగం చేయలేదు, కాబట్టి ఈ సారి కూడా బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.

నిందితుని భార్య వైద్య పత్రాలు, అతని ఇద్దరు పిల్లల ఆరోగ్య పరిస్థితితో సహా, కేసు స్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. నిందితుడు బెయిల్‌పై విడుదలైన తరువాత కేసుకు సంబంధించిన సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని, అలాగే, మంజూరైన మధ్యంతర బెయిల్‌ను ఎలాంటి ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదని న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed