ఇండియా కూటమిలోకి బీఎస్పీ ఎప్పుడైనా రావొచ్చు: కాంగ్రెస్

by samatah |
ఇండియా కూటమిలోకి బీఎస్పీ ఎప్పుడైనా రావొచ్చు: కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) కోసం ఇండియా కూటమి తలుపులు ఎల్పప్పుడూ తెరిచే ఉంటాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే అన్నారు. బీజేపీ వ్యతిరేకంగా జరిగే ఐక్య పోరాటంలో బీఎస్పీ కలిసిరావాలని, ఆ పార్టీ చీఫ్ మాయవతి దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాశ్ మాట్లాడారు. బీఎస్పీ ఇండియా కూటమిలో చేరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీట్ షేరింగ్ విషయం త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా దీనిపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. ఎస్పీతో సానుకూల చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. కూటమి నుంచి ఆర్ఎల్డీ వైదొలగడం దురదృష్టకరమని తెలిపారు. కాగా, ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇటీవల ఆర్ఎల్డీ ఎన్డీయే కూటమిలో చేరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీఎస్పీని ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అక్కడి నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలి!

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే రాహుల్ కూతులు ప్రియాంకా గాంధీ బరిలో నిలుస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే గాంధీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు అవినాష్ పాండే తాజాగా చెప్పారు. దీంతో రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయడం దాదాపు ఖాయమైందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రజల భావోద్వేగాలు, అనుబంధాలు, అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని అవినాశ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed