అహ్మదాబాద్‌లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు: ఫేక్ అని నిర్ధారించిన పోలీసులు

by samatah |
అహ్మదాబాద్‌లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు: ఫేక్ అని నిర్ధారించిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని సుమారు 100 పాఠశాలలకు బెదిరింపులు రాగా..సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సుమారు ఆరు స్కూళ్లలో బాంబులు అమర్చినట్టు ఈ మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు ప్రమాదకరమైన పదార్థాలను ఏమీ కనుగొనలేదు. ఈ హెచ్చరికలు పుకార్లేనని, భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వేసవి సెలవుల కారణంగా పాఠశాలలన్నీ మూసి ఉండటం గమనార్హం.

బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (బోపాల్), ఆనంద్ నికేతన్ (బోపాల్), ఆసియా ఇంగ్లీష్ స్కూల్ (వస్త్రాపూర్), కలోరెక్స్ స్కూల్ (ఘట్లోడియా), అమృత విద్యాలయ (ఘట్లోడియా), న్యూ నోబుల్ స్కూల్ ఉన్నాయి. కాగా, ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలకు సైతం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. రష్యా సర్వర్ ద్వారా ఈ హెచ్చరికలు పంపినట్లు విచారణలో తేలింది. తాజా ఘటనలపై ముమ్మర దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మరోవైపు గుజరాత్ లోని 26 లోక్ సభ నియోజకవర్గాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఓటింగ్‌కు ఒక్కరోజు ముందే ఈ బెదిరింపులు రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా బలగాలను మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed