41 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు!..ఫేక్ అని తేల్చిన పోలీసులు

by Vinod |
41 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు!..ఫేక్ అని తేల్చిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాట్నా , కోయంబత్తూర్, జైపూర్‌తో సహా దేశంలోని అనేక విమానాశ్రయాలకు మంగళవారం బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ మెయిల్స్ ద్వారా సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సుమారు 41విమానాశ్రయాలకు వార్నింగ్స్ ఎదురైనట్టు అధికారులు తెలిపారు. అయితే సోదాల్లో ఎటువంటి అనుమానిత వస్తువులు లభించకపోవడంతో బెదిరింపులన్నీ బూటకమని ధ్రువీకరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలుదేరాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలోనే విమానాన్ని తనిఖీ చేశారు. దీంతో విమానం కాస్త ఆలస్యంగా బయలు దేరింది.

అలాగే తమిళనాడులోని చెన్నయ్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో దుబాయ్ వెళ్లాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. కోయంబత్తూర్ ఎయిర్ పోర్టుకు సైతం వార్నింగ్ రాగా తనిఖీలు చేపట్టారు. అలాగే బిహార్ లోని పాట్నా, రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, ఇటీవల వరుసగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్కూళ్లు, ఆస్పత్రులు, మ్యూజియంలకు బాంబు బెదిరింపులు ఎదురైన విషయం తెలిసిందే.

Next Story