Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో 50 విమానాలకు హెచ్చరికలు

by vinod kumar |
Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో 50 విమానాలకు హెచ్చరికలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఆదివారం మూడు ఎయిర్ లైన్స్‌(Air lines)కు చెందిన మరో 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఇండిగో(indigo)కు చెందిన 18, విస్తారాకు (Vistara)కు చెందిన 17, అకాశ (Akasha)కు చెందిన 15 విమానాలు ఉన్నాయి. వార్నింగ్స్ వచ్చిన అనంతరం విమానాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత, కార్యకలాపాలను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram mohan nayudu) స్పందించారు. బూటకపు బాంబు బెదిరింపులు జారీ చేసే వ్యక్తులను విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించే చర్యలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రెండు పౌర విమానయాన చట్టాల్లో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.

14 రోజుల్లోనే 350 ఘటనలు

తాజా విమానాలతో కలిసి గత 14 రోజుల్లో మొత్తంగా 350కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, విచారణలో ఈ బెదిరింపులన్నీ అవాస్తవమని తేలడం గమనార్హం. మరోవైపు ఈ బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అటువంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ తరహా చర్యలు ఆగడం లేదు. కాగా, ఈ ఘటనల వల్ల విమానయాన శాఖకు రూ.600 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed