ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సహా 8 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

by samatah |
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సహా 8 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సుమారు 8 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 6:20గంటలకు ఎయిర్ పోర్టుకు బాంబు హెచ్చరికలు రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ బృందాలను మోహరించి తనిఖీలు చేపట్టారు. అంతకుముందు మధ్యాహ్నం 3గంటల సమయంలో నగరంలోని బురారీ హాస్పిటల్, సంజయ్ గాంధీ హాస్పిటల్‌ సహా పలు ఆస్పత్రుల్లో బాంబులు అమర్చామని ఈమెయిల్ ద్వారా సమాచారం రాగా అలర్టైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే బెదిరింపు వచ్చిన ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులేమీ కనుగొనలేదని పోలీసు ఉన్నతాధికారి మనోజ్ మీనా తెలిపారు. బురారీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆశిష్ గోయల్‌కు ఈ మెయిల్ వచ్చినట్టు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. కాగా, ఇటీవల ఢిల్లీలోని 150కి పైగా పాఠశాలలకు కూడా బాంబు హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed