జేడీఎస్ నుంచి దేవెగౌడ మనవడు ఔట్.. ? వాట్స్ నెక్ట్స్ ?

by Hajipasha |
జేడీఎస్ నుంచి దేవెగౌడ మనవడు ఔట్.. ? వాట్స్ నెక్ట్స్  ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇంటి పని మనిషిని, ఆమె కూతురిని ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగికంగా వేధించారనే అభియోగాలతో కేసు నమోదైంది. ఇంటి పని మనిషిని ప్రజ్వల్ రేవణ్ణ వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నోరువిప్పి సమాధానం చెప్పలేని స్థితిలో జేడీఎస్, బీజేపీలు ఉన్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పరారైన అంశంపై ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల కోసం జతకట్టిన బీజేపీ, జేడీఎస్‌ల పాలిట ఈ పరిణామాలు పెద్ద షాక్‌లా పరిణమిస్తున్నాయి. జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడకు ఆ పార్టీ ఎమ్మెల్యే శరణ్ గౌడ కంద్కూర్ సోమవారం సంచలన బహిరంగ లేఖ చేశారు. ‘‘ప్రజ్వల్‌ను ఇంకా పార్టీలో కొనసాగించొద్దు. వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

క్షమించే ప్రశ్నే లేదు

ఈ అంశంపై దేవెగౌడ మరో కుమారుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేరం ఎవరు చేసినా క్షమించే ప్రశ్నే లేదు. విచారణలో వివరాలన్నీ బయటకు రానివ్వండి. ప్రజ్వల్ ఎక్కడికి పారిపోయినా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పట్టుకొని దేశానికి తీసుకొస్తుంది’’ అని ఆయన చెప్పారు. మంగళవారం రోజు జరిగే జేడీఎస్ పార్టీ కోర్‌ కమిటీ మీటింగ్‌లో నిర్ణయించిన అనంతరం ప్రజ్వల్‌ను సస్పెండ్‌ చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ‘‘ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రేపు జరిగే కోర్‌ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తాం. ప్రజ్వల్‌ లోక్‌సభ సభ్యుడు. ఢిల్లీ నుంచే నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆయన వెల్లడించారు. ఇక ఈ అంశంపై బీజేపీ స్పందించకుండా మౌనం పాటిస్తోంది. ప్రజ్వల్ సెక్స్ వీడియోల వ్యవహారం గతేడాది డిసెంబరులోనే కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రకు తెలుసని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయినా అతడికి మళ్లీ లోక్‌సభ టికెట్‌ను ఎందుకు కేటాయించారని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed