బుధవారం ఒడిశాలో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం.. కొత్త సీఎంపై ఇంకా సస్పెన్స్

by Harish |
బుధవారం ఒడిశాలో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం.. కొత్త సీఎంపై ఇంకా సస్పెన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: బుధవారం ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దశబ్దాలుగా అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌‌ను ఓడించి కాషాయా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో జూన్ 4న బీజేపీ 78 సీట్లను సాధించింది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు గానూ 20 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జూన్ 10న ఒడిశాలో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఉంటుందని మొదటగా పేర్కొన్నప్పటికీ సీఎం అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోవడంతో దాన్ని జూన్ 12కు వాయిదా వేశారు. బుధవారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్పష్టం కాకపోవడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర సీనియర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్‌ మొదటగా సీఎం అవుతారని భావించినప్పటికీ ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడంతో సీఎం ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ , భూపేంద్ర యాదవ్‌లను బీజేపీ నియమించింది.రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ సురేష్ పూజారి, నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గిరీష్ ముర్ము పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

అయితే గత ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో రాజకీయ విశ్లేషకులు ఊహించని విధంగా సీఎంలను ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ఒడిశాలో కూడా ఇదే విధంగా ఎవరూ ఊహించని వ్యక్తిని సీఎం చేసే అవకాశం కూడా ఉంది. సీఎం పేరును ప్రకటించిన తరువాత ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు భువనేశ్వర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పార్టీ మంగళవారం సమావేశం కానుందని ఒక సీనియర్ నేత పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed