బీజేపీ మేనిఫెస్టో కమిటీలో మాజీ సీఎంలు, కీలక నేతలు వీరే..

by Hajipasha |
బీజేపీ మేనిఫెస్టో కమిటీలో మాజీ సీఎంలు, కీలక నేతలు వీరే..
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను నియమించింది. ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, కో-కన్వీనర్‌గా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్యవహరించనున్నారు. మొత్తం 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, అసోం సీఎం హిమంత బిస్వశర్మ, గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేలకు చోటుదక్కింది.

ఏకే ఆంటోనీ కుమారుడికి చోటు..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మైనారిటీ నేత తారిఖ్ మన్సూర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ(కేరళ), ప్రధాని మోడీ సన్నిహితుడు సుశీల్ మోడీ(బిహార్), మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌‌లను కూడా మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ కీలకమైన కమిటీలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, అసోం, చండీగఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ రాష్ట్రాల నేతలకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క లీడర్‌కు కూడా ఈ అవకాశం కల్పించలేదు. కాగా, కర్ణాటక లోక్‌సభ ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షా, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలతో కలిసి బీజేపీ ప్రచారం చేయనుంది. దేశంలో ఏడుదశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1వ తేదీతో ముగియనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Advertisement

Next Story

Most Viewed