బిల్కిస్ బానో కేసు ఏమిటి ? 11 మంది దోషుల విడుదలపై వివాదమేల ?

by Hajipasha |
బిల్కిస్ బానో కేసు ఏమిటి ? 11 మంది దోషుల విడుదలపై వివాదమేల ?
X

దిశ, నేషనల్ బ్యూరో : బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి, ఏడుగురు కుటుంబ సభ్యులను పాశవికంగా కడతేర్చిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిని గుజరాత్ సర్కారు జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఆ ఖైదీలకు శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. ఆ 11 మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసులో ఒక పార్టీ అయిన గుజరాత్ ప్రభుత్వానికి దోషులను విడుదల చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ కేసును విచారించి, శిక్షలు విధించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వారిని విడుదల చేసే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. ముందస్తు విడుదల కోసం గుజరాత్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవడానికి దోషులను అనుమతిస్తూ 2022 మేలో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (రిటైర్డ్) ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. 2002 గుజరాత్ అల్లర్ల టైంలో బిల్కిస్ బానో కుటుంబంపై చేసిన దారుణాల వాస్తవాలను దాస్తూ మోసపూరితంగా ముందస్తు విడుదల కోసం దోషులు ఆనాడు గుజరాత్ సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యవసానాలను పట్టించుకోకుండా చట్టబద్ధమైన పాలన జరగాలి. మహిళా బాధితుల హక్కులను పరిరక్షించడం ముఖ్యం. మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా మహిళలకు గౌరవం దక్కాలి. వనితలపై క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ముందస్తుగా జైళ్ల నుంచి విడుదల చేయాలనే ఆలోచనే సరికాదు’’ అని జస్టిస్ నాగరత్న కామెంట్ చేశారు.

2022 ఆగస్టు 15న క్షమాభిక్ష..

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో మత అల్లర్లు జరిగాయి. ఆ టైంలోనే బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (రిటైర్డ్) గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దోషులకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ‘‘ఇప్పటికే 14 ఏళ్ల (2008 నుంచి 2022 వరకు) జైలు శిక్ష అనుభవించిన 11 మంది ఖైదీలు సత్ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు. వారంతా సంస్కారవంతుల్లాగా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆ నివేదికలో తెలిపింది. దీంతో గుజరాత్ సర్కారు దోషులందరినీ జైలు నుంచి రిలీజ్ చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక.. 11 మంది దోషులకు పెద్దఎత్తున పూలదండలు, మిఠాయిలతో స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది. సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో బిల్కిస్ బానో, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాలాంటి వారు అనేక మంది ఉన్నారు.

తీవ్రనేరాల్లో జీవిత ఖైదు ఎన్నేళ్లు ?

జీవిత ఖైదు పడితే కనీసం 14 ఏళ్ల పాటు జైలులో గడపాలి. పద్నాలుగేళ్ల తర్వాత నిందితుల ఫైలు పరిశీలనకు వస్తుంది. వయస్సు, నేర స్వభావం, జైలులో ప్రవర్తన మొదలైన వాటి ఆధారంగా వారి శిక్షను తగ్గించొచ్చు. ఖైదీ తన నేరానికి తగినంత శిక్షను అనుభవించినట్లు ప్రభుత్వం భావిస్తే, అతన్ని విడుదల చేయొచ్చు. చాలా సార్లు ఖైదీలు తీవ్ర అనారోగ్యం కారణాల వల్ల కూడా విడుదలవుతుంటారు. జీవిత ఖైదు శిక్ష పడిన నేరస్తులకు, వారు చేసిన నేరం చిన్నదైతే ముందుగా విడుదల చేస్తారు. తీవ్రమైన నేరాలలో ఇలాంటివి జరగవు. బిల్కిస్ బానో కేసులో దోషులంతా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు. అందుకే వారి విడుదల వివాదాస్పదంగా మారింది. అయినా గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed