బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల..

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-29 06:52:02.0  )
బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి 24 మే 2023తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది.

మే 10 పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచే కర్ణాటకలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగ ఓటర్ల కోసం తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం ప్రవేశపెట్టబోతున్నట్లు రాజీవ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 119 కాగా కాంగ్రెస్‌కు 75, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇక్కడ బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్, జేడీఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండగా జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణలు అంచనా వేస్తున్నారు.

కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడంపై ఆసక్తిగా మారుతోంది. జేడీఎస్‌తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేయబోతోందనే ప్రచారం జరుగుతున్న గులాబీ బాస్ ఒంటరిగానే ముందుకు వెళ్తారా లేక కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed