కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్ మంజూరు

by Harish |   ( Updated:2024-06-07 07:39:22.0  )
కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్ మంజూరు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు ఇంటి పని సహాయకురాలి కిడ్నాప్ కేసులో కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, విచారణకు పూర్తిగా సహకరించాలని, మైసూర్‌లోని కేఆర్ నగర్‌లోకి ప్రవేశించవద్దని కోర్టు ఆదేశాలు జారీచేసింది. దర్యాప్తు అధికారి (సిట్) కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంకా విచారణ ముసుగులో ఆమెను సాయంత్రం 5 గంటల తర్వాత విచారణ అధికారి కార్యాలయంలో ఉంచకూడదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మహిళ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హెచ్‌డీ రేవణ్ణకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో భాగంగా మహిళ కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రాగా హెచ్‌డీ రేవణ్ణను సిట్ బృందం అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసులో ఆమె భార్య భవానీ రేవణ్ణను కూడా విచారించాల్సి ఉందని జూన్ 1న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆమెకు నోటీసు జారీ చేసింది. అదే రోజు ‘చెన్నాంబిక నిలయ’లోని భవానీ ఇంటికి సిట్‌ బృందం చేరుకోగా, ఆమె అక్కడ లేరు. మైసూరు, హాసన్, బెంగళూరు, మాండ్య, రామనగర సహా పలు ప్రాంతాల్లో కూడా సిట్ సోదాలు నిర్వహించగా ఆమె కనిపించలేదు. ఆమె తరపున న్యాయవాదులు ముందస్తు బెయిల్‌ కోసం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Next Story

Most Viewed