Atishi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక.. రసాభాసగా మారిన సభ

by Shamantha N |
Atishi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక.. రసాభాసగా మారిన సభ
X

దిశ, నేషనల్ బ్యూరో: గత ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్(CAG) నివేదికను బీజేపీ సర్కారు ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో సభ రసాభాసగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. దీంతో, తప్పని పరిస్థితుల్లో అసెంబ్లీ నుండి మూడు రోజుల పాటు ప్రతిపక్షనేత అతిషీ సహా 21 మంది ఆప్(AAP) ఎమ్మెల్యేలను స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. కాగా.. అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం రేఖా గుప్తా కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సభలో ప్రసంగించారు. అయితే, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఎల్జీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. స్పీకర్ విజేందర్ గుప్తా ఎమ్మెల్యేలను ప్రశాంతంగా ఉండమని పలుమార్లు అభ్యర్థించారు. కానీ, ఎల్జీ మాట వినకుండా ఆప్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించారు. దీంతో, ఆప్ శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఆప్ ఎమ్మెల్యేల ధర్నా

సస్పెన్షన్ తర్వాత శాసనసభ ప్రాంగణంలో ఆప్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడం ద్వారా బీజేపీ తన నిజ స్వరూపాన్ని చూపించిందని ఢిల్లీ మాజీ సీఎం అతిషీ ఆరోపించారు. "అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడం ద్వారా కాషాయ పార్టీ తన నిజ స్వరూపాన్ని చూపించింది. అంబేద్కర్ స్థానంలో మోడీ రాగలరని పార్టీ నమ్ముతుందా?" ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని తిరిగి అదే స్థానంలో ఉంచే వరకు నిరసన కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు, 2021-22 సంవత్సరానికి ప్రస్తుతం అమల్లో లేని మద్యం విధానాన్ని రూపొందించడంలో అక్రమాలు జరిగాయి. ఈ స్కాంలో ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు అరెస్టయ్యారు.

Next Story

Most Viewed