కనీసం మీరైనా జోక్యం చేసుకోండి! రాష్ట్రపతి, ప్రధానికి కోల్ కతా వైద్యుల లేఖ

by Geesa Chandu |
కనీసం మీరైనా జోక్యం చేసుకోండి! రాష్ట్రపతి, ప్రధానికి కోల్ కతా వైద్యుల లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ జీ కర్ హాస్పిటల్ లైంగిక దాడి ఘటనపై, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తో చర్చలు ముందుకు సాగకపోవడంతో.. కోల్ కతా జూనియర్ డాక్టర్ల నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం(సెప్టెంబర్ 13) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదేంటంటే, కోల్ కతా జూనియర్ డాక్టర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఎంతకూ ముందుకు సాగకపోవడంతో.. దీనికి తక్షణమే ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్(West Bengal Junior Doctors Front) తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉపరాష్ట్రపతి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా పంపారు.

కాగా, ఆ లేఖలో అతి దారుణంగా బలైపోయిన తోటి జూనియర్ డాక్టర్ కు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలకు ఉపక్రమించాలని కోరినట్లు తెలుస్తోంది.అలాగే మీరు సంస్థాగతంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టే, మేము మా వృత్తిలో భయం లేకుండా విధులను నిర్వర్తించగలమని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ కష్ట కాలంలో కేంద్రం తీసుకునే నిర్ణయం మాకు ధైర్యాన్ని, భరోసాను ఇస్తుందని, తమ చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడే మార్గాన్ని చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు కేంద్రానికి రాసిన లేఖలో వెల్లడించారు.

Advertisement

Next Story