అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు

by S Gopi |
అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. రూ.లక్ష పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి న్యాయ్ బిందు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం బెయిల్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి సాయంత్రానికి బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్‌ శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరిన ఈడీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు అవకాశం లభిస్తుందని అభ్యర్థించింది. అయితే ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు అందుకు నిరాకరించింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత తిరిగి జూన్‌ 2న తిహార్‌ జైలులో కేజ్రీవాల్ లొంగిపోయారు. కేజ్రీవాల్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆప్ పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలు పటాకులు పేల్చారు. కేజ్రీవాల్ విడుదల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. సత్యమే గెలిచిందని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ తెలిపారు. కాగా, ఇదే కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా ఇంకా తీహార్ జైలులో మగ్గుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed