‘సిమి’పై బ్యాన్ ఐదేళ్లు పొడిగింపు.. ఎందుకో చెప్పిన అమిత్‌షా

by Hajipasha |
‘సిమి’పై బ్యాన్ ఐదేళ్లు పొడిగింపు.. ఎందుకో చెప్పిన అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)‌పై విధించిన నిషేధాన్ని కేంద్ర సర్కారు మరో ఐదేళ్లపాటు పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) ప్రకారం గతంలో సిమిపై విధించిన బ్యాన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈవిషయాన్ని తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా మేం ఉపేక్షించం. అందుకే సిమిపై విధించిన బ్యాన్‌ను ఐదేళ్లు పొడిగిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. ‘‘భారత సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా సిమి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. దేశంలో శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగించేలా కుట్రలు పన్నిందని దర్యాప్తులో తేలింది. అలాంటి సంస్థలకు మన దేశంలో చోటులేదు’’ అని అమిత్‌షా స్పష్టం చేశారు. ‘‘సిమి తెరచాటు నుంచి ఇంకా విధ్వంసకర కార్యకలాపాలను కొనసాగిస్తోంది. చెల్లాచెదురైన సిమి సభ్యులను తిరిగి ఏకం చేసే విష ప్రణాళికలను రచిస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. అందుకే దానిపై బ్యాన్ కంటిన్యూ చేయక తప్పదు’’ అని కేంద్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు. కాగా, బీజేపీ దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2001లో తొలిసారి సిమిపై బ్యాన్ విధించారు. అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకోసారి బ్యాన్‌ను పొడిగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed