Kolkata doctors protest: నిరసన చేస్తున్న వైద్యులపై దాడికి కుట్రలు

by Shamantha N |
Kolkata doctors protest: నిరసన చేస్తున్న వైద్యులపై దాడికి కుట్రలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి కుట్రలు జరిగాయిని తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార పార్టీ పరువు తీసేందుకే "ప్రతిపక్ష శక్తులు" ఆందోళనకారులపై దాడికి కుట్ర పన్నుతున్నాయన్నారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కుట్రకు రుజువుగా చూపించారు. ‘వామపక్ష యువజన విభాగం సభ్యుడు, అల్ట్రా-లెఫ్ట్ సంస్థకు చెందిన ఒకరి మధ్య ఆ సంభాషణ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోతైన కుట్ర ఉందని దాని గురించి మాట్లాడినట్లుగా అందులో ఉంది. వారు ధర్నా చేస్తున్న వైద్యులపై దాడి చేస్తారు. ఆ తర్వాత అధికార పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ఘటనకు బాధ్యులుగా చేస్తారు. ఇది ప్రధాన కుట్ర.’ అని ఘోష్ శుక్రవారం అన్నారు. వైద్యులు నిరసన చేపడుతున్న ప్రదేశానికి సమీపంలో బయటి వ్యక్తుల ప్రవేశాన్ని పోలీసులు ఆపాలని కోరారు. కోల్ కతా సాల్ట్ లేక్లోని స్వాస్త్య భవన్ లో భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఇకపోతే, కునాల్ ఘోష్ దగ్గరికి ఈ క్లిప్ ఎలా వచ్చిందో పోలీసులు దర్యాప్తు చేయాలని సీపీఐ(ఎం) అధికార ప్రతినిధి ఫువాద్ హలీమ్ అన్నారు.

చర్చల ప్రతిష్టంభన

ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగినప్పట్నుంచి వైద్యులు నిరసన చేస్తున్నారు. గత మంగళవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం, డాక్టర్ల మధ్య చర్చల ప్రతిష్టంభన కొనసాగుతోంది. వైద్యులు చేసిన నాలుగు డిమాండ్లలో మూడింటికి ప్రభుత్వం అంగీకరించింది. కానీ, వైద్యులు కోరిన 'లైవ్ టెలికాస్ట్'కి బెంగాల్ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో అది జరగలేదు. గురువారం సమావేశం జరగకపోవడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారణాన్ని వివరించారు. ఈ కేసు విషయం కోర్టులో ఉందని, సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని పేర్కొన్నారు.

Advertisement

Next Story