ఇండోర్‌లో నోటాకు 2 లక్షలకు పైగా ఓట్లు

by Harish |   ( Updated:2024-06-04 11:22:30.0  )
ఇండోర్‌లో నోటాకు 2 లక్షలకు పైగా ఓట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. నోటాకు దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం సాయంత్రం వరకు 2,02,212 నోటా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు కూడా నచ్చనట్లయితే ఈ గుర్తుకు ఓటు వేయవచ్చు. దీనిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2013 లో ప్రవేశపెట్టారు. ఇండోర్‌లో మే 13న ఓటింగ్ జరిగింది, 25.27 లక్షల మంది ఓటర్లలో 61.75 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో దాదాపు లక్షకు పైగా మంది నోటాకు ఓటు వేయడం గమనార్హం.

ఇండోర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అక్షయ్‌కాంతి బామ్ నామినేషన్‌ను వేసినప్పటికి చివరి నిమిషంలో దానిని ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ తన ప్రచారంలో నోటాకు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు కూడా కాంగ్రెస్, నోటాకు రెండు లక్షల ఓట్లు వస్తాయని సోమవారం ప్రకటించింది. ఇప్పుడు ఆ అంచనాలకు అనుగుణంగానే నోటాకు ఓట్లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఇండోర్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ రికార్డు నెలకొల్పే దిశగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటివరకు 11,60,627 లక్షల ఓట్లు సాధించారు.. కాగా, లోక్ సభ చరిత్రలో ఇప్పటి వరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో 6.9 లక్షల అత్యధిక మెజార్టీ ఉంది. తాజాగా, దీన్ని శంకర్ లల్వానీ అధిగమించారు

Advertisement

Next Story