AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ కన్నుమూత

by vinod kumar |
AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది, ప్రముఖ పండితుడు ఏజీ నూరానీ(93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1930 సెప్టెంబర్ 16న జన్మించిన నూరానీ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. రాజ్యాంగ చట్టంలో తనకున్న పరిజ్ఞానంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేగాక కశ్మీర్, ఆర్టికల్ 370కి సంబంధించిన సమస్యలపై అనేక పుస్తకాలను రాశారు. ది కాశ్మీర్ క్వశ్చన్, ది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ది ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్, కాన్‌స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఆప్ ఇండియా, ఆర్‌ఎస్‌ఎస్ అండ్ ద బీజేపీ: ఎ డివిజన్ ఆఫ్ లేబర్, ఆర్టికల్ 370: ఎ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ అతని ముఖ్యమైన రచనలు.

దేశవ్యాప్తంగా సెమినార్లలో అనేక పరిశోధక పత్రాలను సమర్పించాడు. అలాగే అనేక రకాల క్లిష్టమైన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నూరానీ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఏజీ నూరానీ మరణం బాధాకరం. ఆయన మంచి పండితుడుు, రాజకీయ వ్యాఖ్యాత. చట్ట విషయాలపై ఎంతో అవగాహన ఉండటంతో పాటు రాజ్యాంగ విషయాలపై విస్తృత రచనలు చేశారు’ అని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం సంతాపం తెలిపారు.

Advertisement

Next Story