Aditya Surjewala: 25 ఏళ్లకే ఎమ్మెల్యే.. హర్యానాలో సంచలనం

by vinod kumar |
Aditya Surjewala: 25 ఏళ్లకే ఎమ్మెల్యే.. హర్యానాలో సంచలనం
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. 25ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జేవాలా విజయం సాధించారు. కైతాల్ స్థానం నుంచి బరిలో నిలిచిన ఆయన 8,124 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆదిత్యకు 83,744 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత లీలా రామ్ 75,620 ఓట్లు పోలయ్యాయి. ఆదిత్య బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

కాగా, ఒకే కుటుంబానికి చెందిన మూడో తరం నాయకుడిగా ఆధిత్య నిలిచారు. తన తాత షంషేర్ సింగ్ సుర్జేవాలా, తండ్రి రణదీప్ సింగ్‌లు కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల అనుబంధం కలిగి ఉన్నారు. అంతేగాక కైతాల్ నియోజకవర్గం నుంచి ఆదిత్య తాత షంషేర్ సింగ్ సూర్జేవాలా 2005లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం 2009, 2014లో ఆయన కుమారుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేసిన రణదీప్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో ఆయన కుమారుడు ఆదిత్య విజయం సాధించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed