Abhijit: కాంగ్రెస్‌లోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు.. టీఎంసీపై తీవ్ర విమర్శలు

by vinod kumar |
Abhijit: కాంగ్రెస్‌లోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు.. టీఎంసీపై తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranabh mukharjee) కుమారుడు అభిజిత్ ముఖర్జీ (Abhi mukarjee) బుధవారం కాంగ్రెస్‌ పార్టీ (Congress) లో చేరారు. కోల్‌కతాలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్ (Ahmad meer), జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే సమక్షంలో హస్తం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2012లో జంగిపూర్ (Jangipoor) లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన అభిజిత్ 2014లోనూ అదే సెగ్మెంట్ నుంచి మరోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో చేరారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు.

టీఎంసీలో చేరి తప్పు చేశా

కాంగ్రెస్‌లో చేరిన అనంతరం అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను టీఎంసీలో చేరి పెద్ద తప్పు చేశానని తెలిపారు. కాంగ్రెస్‌లో లభించిన గౌరవం తనకు ఎక్కడా దొరకలేదని చెప్పారు. దేశంలోని విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేకుండా దేశాన్ని ఏకం చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ మాత్రమేనని, మరే ఇతర రాజకీయా పార్టీ ఆ కోవలోకి రాదని వెల్లడించారు. అయితే వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అభిజిత్ టీఎంసీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story