- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తుపట్టలేని విధంగా శరీరాలు.. మృతదేహాలను తీసుకొచ్చేందుకు విమానం రెడీ
దిశ, నేషనల్ బ్యూరో: ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని కువైట్‌కు వలస వెళ్లిన భారత కార్మికుల అకాల మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆ అరబ్ దేశంలోని మందాఫ్ జిల్లాలో ఉన్న ఆరు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 42 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో అత్యధికంగా 24 మంది మలయాళీలే ఉండటం విషాదకరం. ఇంకో ఐదుగురు తమిళనాడు వాస్తవ్యులు ఉన్నారు. మిగతా 13 మంది ఏయే రాష్ట్రాలవారు అనేది నిర్ధారించాల్సి ఉంది. వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో సంభవించిన ఈ భీకర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాలు దారుణంగా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. శరీరానికి మంటలు అంటుకున్న తర్వాత.. కొంతమంది భవనం నుంచి బయటికి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఈక్రమంలో పలువురు అపార్ట్‌మెంటులోని మెట్లపై పడిపోయి తుదిశ్వాస విడిచారు. తలుపుకు తాళం వేసి ఉండటంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని సమాచారం.
ఈ అపార్ట్‌మెంటులోని మొత్తం 49 మంది సజీవ దహనం కాగా.. కువైట్ ప్రభుత్వ వర్గాలు డెడ్‌బాడీస్‌కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి దాదాపు చాలామంది వివరాలను గుర్తించాయి. కొన్ని డెడ్‌బాడీస్ గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో.. వాటిని గుర్తుపట్టడం కష్టతరంగా మారింది. మృతదేహాలను గుర్తించిన వెంటనే, వారి బంధువులకు సమాచారాన్ని చేర వేయనున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయుల్లో ఎక్కువ మంది రైతు కుటుంబ నేపథ్యం కలిగిన వారే ఉండటం గమనార్హం.
క్షతగాత్రులను పరామర్శించిన కీర్తి వర్ధన్ సింగ్
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు హుటాహుటిన కువైట్‌కు చేరుకున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ భారతీయ క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి వాయుసేన విమానాన్ని సిద్ధం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయిలో సమీక్షించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌లతో సమీక్షా సమావేశం అనంతరం ప్రధాని సహాయ నిధి నుంచి మరణించిన భారతీయ పౌరుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రధాని ప్రకటించారు.
కువైట్‌కు కేరళ ఆరోగ్యమంత్రి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన గురువారం ఉదయం అత్యవసర మంత్రివర్గ సమావేశం జరిగింది. కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన మలయాళీల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఈ మీటింగ్‌లో నిర్ణయించారు. గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని, మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ను వెంటనే కువైట్‌కు పంపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు తమిళుల మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడానికి తమిళనాడు సర్కారు చర్యలు చేపట్టింది. గాయపడిన తమిళనాడు వాసులకు అవసరమైన వైద్య సేవలు అందే ఏర్పాట్లు చేస్తామని తమిళనాడు సంక్షేమ శాఖ మంత్రి జింగీ కేఎస్ మస్తాన్ వెల్లడించారు.