ఇలాంటి కొడుకుల కన్నా కుక్క మేలు! 85 ఏళ్ల తల్లిపై దాడి చేసిన కొడుకు.. కోడలు సైతం!

by Ramesh N |
ఇలాంటి కొడుకుల కన్నా కుక్క మేలు! 85 ఏళ్ల తల్లిపై దాడి చేసిన కొడుకు.. కోడలు సైతం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్ (Punjab) లూథియానా జిల్లాలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఓ కొడుకు వృద్ధురాలని చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గొంతు నులిమి చంపేయబోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఈ క్రమంలోనే వృద్దురాలి కొడుకు, కోడలిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌కోట్‌లోని మొహల్లా బ్యాంక్ కాలనీలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఆమె కుమారుడు, కోడలు దారుణంగా కొట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉంటున్న వృద్దురాలి కుమార్తె లైవ్ సీసీటీవీ కెమెరాల ద్వారా దాడిని చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు గుర్నమ్ కౌర్ తన కుమారుడు జస్వీర్ సింగ్, కోడలు గురుప్రీత్ కౌర్ తో కలిసి నివసిస్తోంది. ఏప్రిల్ 1న, ఆమె కుమార్తె ఇంటి సీసీటీవీ ఫీడ్‌ను తనిఖీ చేస్తుండగా, తన తల్లిని తీవ్రంగా కొట్టడం చూసింది. దీంతో ఆ ఫుటేజ్ చూసి షాక్ అయిన కుమార్తె, హ్యుమానిటీ సర్వీసెస్ చైర్మన్ గుర్ప్రీత్ సింగ్‌ను సంప్రదించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని గుర్నమ్ కౌర్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే వృద్ధురాలి గాయాల గురించి వైద్య నివేదిక అందిన తర్వాత పోలీసులు కొడుకు, కోడలి పై చర్యలు తీసుకున్నారు. కుమారుడు, కోడలు చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని తల్లి ఫిర్యాదులో వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

నిందితులు తమ చర్యలను అంగీకరించారు.. కానీ వారి ప్రవర్తనను సమర్థించుకోవడానికి ప్రయత్నించారని ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును స్వయంగా స్వీకరించింది. గురువారం నాటికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని కమిషన్ లూథియానా పోలీసులను ఆదేశించింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కొడుకు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కొడుకుల కన్నా కుక్క మేలు అని, కుక్కలు విశ్వాసంగా ఉంటాయని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.

Next Story

Most Viewed