Rahul Gandhi : ప్రభుత్వ వ్యవస్థకు దూరంగా 90 శాతం జనాభా : రాహుల్ గాంధీ

by Hajipasha |
Rahul Gandhi : ప్రభుత్వ వ్యవస్థకు దూరంగా 90 శాతం జనాభా : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో 90 శాతం నేటికీ ప్రభుత్వ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లందరికీ భారత ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాల్లో తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’లో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ పాలనా వ్యవస్థకు దూరంగా ఉండిపోయిన 90 శాతం మంది ప్రజలకు కూడా నైపుణ్యాలు, నాలెడ్జ్ ఉన్నాయి. కానీ పాలనా వ్యవస్థలో భాగస్వాములుగా మారే అవకాశం వారికి లభించడం లేదు. అందుకే మేం కులగణన నిర్వహించాలని అడుగుతున్నాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

‘‘కులగణన అంటే కులాల వారీగా ప్రజల సంఖ్య అని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మా దృష్టిలో అది కేవలం లెక్క కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పునాది’’ అని ఆయన వెల్లడించారు. ‘‘కులగణన చేసి వదిలేస్తే సరిపోదు. వివిధ కులాల మధ్య సంపద పంపిణీ ఎలా ఉందనేది కూడా అధ్యయనం చేయాలి. బ్యూరోక్రసీ, జ్యుడీషియరీ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంతమేర ఉందనేది తెలుసుకోవాలి’’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘‘2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీ నాకు ఒక గురువుగా మారింది. ఏం చేయకూడదు అనేది ఆ పార్టీని చూసి నేర్చుకుంటున్నాను’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed