'భారత్‌లో 82% మంది హిందువులు ఉన్నారు'.. ఇంకా హిందూ దేశంగా మార్చడమేంటి..?: Kamal Nath

by Vinod kumar |
భారత్‌లో 82% మంది హిందువులు ఉన్నారు.. ఇంకా హిందూ దేశంగా మార్చడమేంటి..?: Kamal Nath
X

భోపాల్: భారత్‌లో 82% మంది హిందువులు ఉన్నారని, ఇంకా ప్రత్యేకంగా హిందూ దేశాన్ని తయారు చేయడమేంటని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భోపాల్‌లో ఆయన మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని తనను తాను గాడ్ మ్యాన్‌గా ప్రకటించుకున్న బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి ఇటీవల డిమాండ్ చేశారు. దీనిపై కమల్‌నాథ్ స్పందిస్తూ.. ‘హిందూ దేశాన్ని తయారు చేస్తే ప్రత్యేకంగా వచ్చే లాభం ఏంటి..? ఇక్కడ ఇప్పటికే 82% మంది హిందువులు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో హిందువులు ఉన్న దేశంలో ఇది చర్చనీయాంశమా..? ఈ గణాంకాలను చూసిన తర్వాత కూడా భారత్‌ను ప్రత్యేకంగా హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందా అనే అనుమానం కలుగుతుంది’ అన్నారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిపై కమల్‌నాథ్ స్పందిస్తూ.. ‘మధ్యప్రదేశ్‌లో గిరిజనులపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు మనం గిరిజన దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటాం. ప్రపంచానికి ఏం చెబుతాం. ఎలాంటి గిరిజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..? ఇది సిగ్గుపడాల్సిన విషయం’ అని కుండబద్దలు కొట్టారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి కమల్‌నాథ్ స్పందిస్తూ.. ‘చరిత్రలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాల సంఖ్య దేశ రికార్డే కాదు.. ప్రపంచ రికార్డు’ అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed