Smart Meters : దేశంలో 73లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాం.. పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

by Sathputhe Rajesh |
Smart Meters : దేశంలో 73లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాం.. పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో నవంబర్ 29 వరకు 73 లక్షల స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు పార్లమెంట్‌లో కేంద్రం సోమవారం ప్రకటించింది. 11 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక్క స్మార్ట్ మీటర్ అమర్చలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ప్రకటన చేశారు. జులై 2021లో ప్రారంభించిన రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్) కింద మార్చి 2025 నాటికి దాదాపు 25 కోట్ల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు రూ.3లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 29 నాటికి 19.79 కోట్ల స్మార్ట్ మీటర్లు మంజూరు కాగా అందులో 72.97 లక్షల మీటర్లను అమర్చినట్లు రాజ్యసభలో ఆయన తెలిపారు.

ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..

తమిళనాడుకు 3కోట్లు, రాజస్థాన్ 1.42 కోట్లు, త్రిపురకు5.42లక్షలు, పంజాబ్‌కు 87.94 లక్షలు చొప్పున వీటిని మంజూరు చేయగా ఒక్కటి కూడా అమర్చలేదని వెల్లడించారు. నాగాలాండ్ 3.17 లక్షలు, మేఘాలయా 4.60లక్షలు, మిజోరం 2.89 లక్షలు, జార్ఖండ్ 13.14 లక్షలు, కేరళ 1.32 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 2.87 లక్షలు, గోవా 7.41లక్షలు మంజూరు చేయగా ఒక్క మీటర్ అమర్చలేదని స్పష్టం చేశారు. అండమాన్ నికోబార్ 83,573, పుదుచ్చేరిలకు 4.03లక్షల మీటర్లు మంజూరు చేయగా అక్కడ సైతం వాటిని ఇన్‌స్టాల్ చేయలేదని తెలిపారు. అస్సాంకు 63.64 లక్షల మీటర్లు మంజూరు కాగా అత్యధికంగా 22.89 లక్షల మీటర్లు అమర్చినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌కు 15.87లక్షల మీటర్లు మంజూరు చేయగా కేవలం ఏడు మాత్రమే అమర్చినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed